తమిళనాడు అంటే ముందుగా గుర్తొచ్చేది జల్లికట్టు. ఈ ఆట కోసం అక్కడి వారు ప్రాణాలను సైతం లెక్కచేయరు. అందులో పాల్గొనే ఎద్దులను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. జల్లికట్టులో పాల్గొన్న ఓ వృషభం చనిపోతే.. గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నా.. ప్రాణాలమీదకు వస్తుందని తెలిసినా సుమారు 2వేలమంది హాజరయ్యారంటే వారికి ఆ ఎద్దుపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతోంది. ఈ నెల 12న జరిగిన ఈ కార్యక్రమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది
ముదువరపట్టి గ్రామంలోని చెల్లాయి అమ్మాన్ ఆలయంలో ఉండే మూలి అనే ఎద్దు ఏప్రిల్ 12న మదురై నగర శివారులో మృతి చెందింది. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ.. ఆ వృషభానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది.. చనిపోయిన ఎద్దును పూలమాలలతో అలంకరించి గ్రామ నడిబొడ్డున ప్రదర్శనకు ఉంచారు. గ్రామస్థులంతా అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చుతూ.. డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
పోలీసుల చర్యలు..
సామాజిక మాధ్యమాల ద్వారా ఎద్దు అంత్యక్రియల విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంత మంది గుమిగూడటంపై చర్యలు చేపట్టారు. అంత్యక్రియలు నిర్వహించిన గ్రామపెద్దలు సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇంత పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినా అడ్డుకునే విషయంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు అధికారులు, పలమేడు సబ్ఇన్స్పెక్టర్ జయకన్నన్, స్పెషన్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మనిరాజ్ను బదిలీ చేశారు. వారిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారులకు తెలపాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి ఉందని.. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలిస్తే స్థానిక పోలీసులు, గ్రామస్థుల మధ్య ఒప్పందం కుదిరినట్లు కనిపిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ విషయమై మదురై ఎస్పీ మనివన్నన్.. ఈటీవీ భారత్తో పలు విషయాలు వెల్లడించారు.
"ఘటన విషయం గురువారమే మాకు తెలిసింది. అలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అడ్డుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నాం. ఆ ప్రాంతంలో కరోనా ప్రభావం లేనందున.. మొత్తం గ్రామాన్ని క్వారంటైన్ చేసే ఆలోచన లేదు."
- మనివన్నన్, మదురై ఎస్పీ.
ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్