ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబేకు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని ముందే సమాచారం వెళ్లినట్లు చెప్పాడు అతని సహాయకుడు దయాశంకర్ అగ్నిహోత్రి. శనివారం పోలీసులకు చిక్కిన అగ్నిహోత్రి.. జులై 3 ఎన్కౌంటర్పై పోలీస్ స్టేషన్ నుంచే సమాచారం అందినట్లు వెల్లడించాడు. దాడి విషయం తెలిసిన వెంటనే 25 నుంచి 30 మందిని పిలిచి పోలీసులను ఎదుర్కొనేందుకు దూబే సన్నద్ధమయినట్లు తెలిపాడు.
దూబే కాల్పులు..
జులై 3న కాల్పులు జరిగే సమయంలో దూబే అక్కడే ఉన్నాడని వెల్లడించాడు అగ్నిహోత్రి. పోలీసులపై స్వయంగా కాల్పులు జరిపాడని చెప్పాడు. ఘటనా సమయంలో తాను ఓ గదిలో దాక్కున్నానని.. అందువల్ల ఎన్కౌంటర్ సందర్భంగా ఏం జరిగిందనేది తెలియదని పోలీసులకు వివరించాడు. శనివారం రాత్రి పోలీసులు, దూబే అనుచరుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల అనంతరం అగ్నిహోత్రిని అరెస్టు చేశారు పోలీసులు.
ఇదీ చూడండి: దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత