కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేకు బెయిల్ రావడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరస్థులకు బెయిల్ రావడాన్ని వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించింది.
దుబే సహా అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై విచారణలో కోర్టు పర్యవేక్షణ ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు ఆలకించింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేస్తున్న కమిటీలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, విశ్రాంత పోలీసు అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ కమిటీలో సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని నియమించలేమని స్పష్టం చేసింది.
"హైదరాబాద్(దిశా కేసు) ఘటనకు, దీనికి తేడా ఉంది. కానీ ఓ ప్రభుత్వంగా చట్టాన్ని పరిరక్షించాలి. ఇది వారి బాధ్యత. దీనికి అరెస్టులు, విచారణ, శిక్ష విధించడం వంటి ప్రక్రియ అవసరం. చాలా కేసులు ఉన్నప్పటికీ వికాస్ దుబే లాంటి వ్యక్తికి బెయిల్ లభించడం ఆశ్చర్యకరం. జైల్లో ఉండాల్సిన వ్యక్తికి బెయిల్ లభించింది. ఇది వ్యవస్థ వైఫల్యం."
-సుప్రీంకోర్టు
విచారణ కమిటీలో మార్పులకు సంబంధించి ముసాయిదా తీర్మానాన్ని జులై 22లోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీ సర్కార్ అఫిడవిట్
ఈ కేసుకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దుబే, అతని అనుచరుల ఎన్కౌంటర్ విషయంలో దర్యాప్తు చేయడానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్‌ను నియమించినట్లు ధర్మాసనానికి తెలిపింది.
అంతకుముందు.. వాదనల సందర్భంగా విచారణ ప్యానెల్లో సుప్రీంకోర్టు సూచించిన మార్పులకు సంబంధించి జులై 22లోగా ముసాయిదా నోటిఫికేషన్‌ను రూపొందిస్తామని మెహతా తెలిపారు. దుబేపై 65 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. నిందితుడు పెరోల్‌పై బయటకు వచ్చాడని వెల్లడించారు. 8 మంది పోలీసులను చంపి వారి శరీరాలను ఛిద్రం చేశారని మెహతా పేర్కొన్నారు. అయితే దుబే ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం లేదని తెలిపారు.
ఇవే మానుకోండి!
విచారణ కమిటీలో నియమించే సభ్యులను ఎంపిక చేసుకునే అధికారాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వకూడదన్న ఓ పిటిషనర్ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వైఖరిని మానుకోవాలని పిటిషనర్‌కు హితవు పలికింది.
ఇదీ చదవండి- ''మోదీ-బలమైన వ్యక్తి' కల్పితమే.. దేశ అతిపెద్ద బలహీనత'