కర్ణాటకలో మరాఠా అభివృద్ధి ప్రాధికార(డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటన చేయడం వల్ల కన్నడిగులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠా భాషీయుల సంక్షేమానికి ఈ ప్రకటన చేసినా.. కన్నడ ఐక్యతకు ఇది గొడ్డలిపెట్టు లాంటిదని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలువళి వంటి సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా డిసెంబరు 5న కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి.
మరోవైపు శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే జయంతి సందర్భంగా.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో మరింత అలజడి రేపింది. బాల్ థాకరే కలలు నెరవేర్చాలంటే కర్ణాటకలోని బెళగావి, కార్వార, నిప్పణి ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా.. ఆయన మంత్రివర్గమం భగ్గుమంది.
కన్నడనాట మరో జిల్లా
కర్ణాటకలో మరో జిల్లా అవతరించనుంది. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బళ్లారి జిల్లాలోని హంపి చుట్టుపక్కల ప్రాంతాలను విడదీసి 'విజయనగర జిల్లా'గా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హొసపేటె కేంద్రంగా రూపొందే విజయనగర జిల్లా పరిధిలో హొసపేటె, కంప్లి, హగరిబొమ్మనహళ్లి, కొట్టూరు, హడగళ్లి, హరపనహళ్లి తాలూకాలను చేర్చనున్నారు. దీంతో కర్ణాటకలో జిల్లాల సంఖ్య 31కి చేరనుంది.
ఇదీ చదవండి: దిల్లీలో కరోనా ఉద్ధృతిపై సీఎం అఖిలపక్ష భేటీ