కె.పరాశరన్....పరిచయం అవసరం లేని న్యాయకోవిదుడు. ‘అయోధ్య’ స్థలవివాదం కేసులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన ‘హీరో’గా నిలిచారు. ‘‘నేను మరణించే లోగా ఈ కేసును పూర్తి చేయాలి. అదే నా అంతిమ కోరిక’’ అంటూ ఆయన ఓ సందర్భంలో సుప్రీంకోర్టులో పేర్కొనటం గమనార్హం.
92 ఏళ్ల వయసులోనూ పట్టువదలకుండా, అలసటనేదే లేకుండా శ్రీరాముడి కోసం, ఆ రాముడి(రామ్‌లల్లా విరాజ్‌మాన్) తరఫున ఇన్నేళ్లుగా వాదించారు పరాశరన్.
‘అయోధ్య స్థలం’పై సర్వోన్నత న్యాయస్థానం శనివారం తుది తీర్పు వెలువరించే వరకూ పరాశరన్ ఓపిగ్గా కోర్టు హాలులో మొదటి వరుసలో ఆసీనులయ్యారు.
విజయం వరించిన వేళ
చీఫ్‌జస్టిస్ రంజన్‌గొగొయి చదువుతున్న తీర్పును ఏకాగ్రతతో విన్నారు పరాశరన్. తుదితీర్పు వెలువడగానే న్యాయవాదులంతా ఒక్కసారిగా పరాశరన్ చుట్టూ గుమికూడి ఆయనను అభినందనల్లో ముంచెత్తేశారు. కొద్ది నిముషాల తర్వాత తన జూనియర్‌ల సాయంతో కోర్టు గది నుంచి మెల్లగా వెలుపలికి రాగా అక్కడున్న వారి చేతుల్లోని మొబైళ్లన్నీ ఒక్కసారిగా క్లిక్‌మనడం మొదలైంది.పరాశరన్ వారందరినీ తన ఫొటో తీసుకునేందుకు అంగీకరించారు.
1958 నుంచి న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు పరాశరన్. రెండు పర్యాయాలు భారత అటార్నీ జనరల్‌గా పనిచేసిన న్యాయశాస్త్రంలో దిట్ట. హిందూ పవిత్ర గ్రంథాలను ఆపోశన పట్టిన మహా పండితుడు. తనకున్న ఆ అపార పరిజ్ఞానాన్ని వాదనల్లో అద్భుతంగా ప్రతిబింబింప చేశారు.
భారత ప్రభుత్వం పరాశరన్‌ను 2003లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. గత నెల 16న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజెన్’ అవార్డును పరాశరన్‌కు అందజేశారు.