ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌కు విముక్తి లభించిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనకపడిపోయిందని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాతే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి జమ్ము, కశ్మీర్‌లు అభివృద్ధివైపు అడుగులేయడం ప్రారంభించాయన్నారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఉపరాష్ట్రపతిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలు ట్వీట్లు చేశారు వెంకయ్యనాయుడు.
"సీమాంతర ఉగ్రవాదం వల్ల ఒక తరం తెలివైన స్థానిక యువత అవకాశాలను కోల్పోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేందుకు మేము అంగీకరించలేదు. త్వరితగతిన ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఆర్టికల్ 370 రద్దు ఎంతో అవసరం. జమ్ముకశ్మీర్ దేశానికి కిరీటంలాంటిది. మంచు పర్వతాలు, పచ్చని లోయలు, నదీప్రవాహాలు వంటి వాటితో ఎంతో ఆహ్లాద భరితమైన వాతావరణం ఆ ప్రాంతం సొంతం. ప్రజల స్నేహపూర్వక స్వభావం, ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, వంటకాలు, సంస్కృతి, సంగీతానికి కశ్మీర్ ఎంతో ప్రసిద్ధి చెందింది."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ విద్యార్థులను దేశ రాజధాని దిల్లీ పర్యటనకు తీసుకొచ్చిన భారత ఆర్మీని ఆయన అభినందించారు. ఈ పర్యటన మీకు గుర్తుండిపోతుందని విద్యార్ధులనుద్దేశించి ట్విట్టర్ వేదికగా తెలిపారు ఉపరాష్ట్రపతి. దేశంలో వేగవంతమైన మార్పులను చూడబోతున్నారని పేర్కొన్నారు.