కరోనా వైరస్ తీవ్రతపై వస్తున్న వదంతులు సరైనవి కావని.. దీనికి భారత వైద్య పరిశోధన సంస్థ పూర్తి వివరణతో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా కంటే వైరస్ వ్యాప్తిపై నెలకొంటున్న భయాలే మరింత ప్రమాదకరంగా మారాయన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని కలిసిన అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ సంఘం సభ్యులు... కరోనా వైరస్ వ్యాప్తిపై వస్తున్న వదంతులు పౌల్ట్రీ పరిశ్రమపై పెను ప్రభావాన్ని చూపించాయని విన్నవించారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరగడం వల్ల పౌల్ట్రీ ఉత్పత్తుల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని తెలిపారు. దీనిపై చొరవ తీసుకుని పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కరోనాపై వెల్లువెత్తుతున్న వదంతులకు వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలన్నారు.
సవివర సమాధానం
ఈ సందర్భంగా భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవతో ఫోన్లో మాట్లాడారు వెంకయ్య. చికెన్, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వస్తుందంటూ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు సమాధానంగా పూర్తి వివరాలతో ఒక నివేదిక విడుదల చేయాలని సూచించారు. కొనుగోలుదారులు, అమ్మకపు దారులకు సరైన సమాచారాన్ని అందజేయాలన్నారు.
లక్షలమంది రైతులు పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఆదాయం పెంచడంలో, దేశ పోషకాహార భద్రత విషయంలో పౌల్ట్రీ రంగం కీలకంగా ఉందన్నారు వెంకయ్య.
ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ఉపరాష్ట్రపతి ఆదేశించారు. దీనిపై స్పందించిన మంత్రి అనురాగ్ ఠాకూర్.. పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిశీలించి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అఖిలభారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ బహదూర్ అలీ, ఉపాధ్యక్షుడు శ్రీ సురేశ్ చిట్టూరి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇక మాస్కులు, శానిటైజర్లు నిత్యావసర వస్తువులే
ఇదీ చదవండి: కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి