ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కోవడానికి యోగా గొప్ప సాధనమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కరోనాపై ప్రజలందరూ ఏకమై పోరాడటానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. 'యోగా సులభంగా చేయదగింది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి' అని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు వెంకయ్య.
బలవన్మరణాలు నివారించవచ్చు!
ఆధునిక జీవనశైలి వల్ల సర్వసాధారణంగా మారిన నిరాశ, నిస్పృహ, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి యోగా సహాయపడుతుందన్నారు ఉపరాష్ట్రపతి. యోగా కేవలం ఒక వ్యాయామం కాదని... అంతకంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలకు గురై యువకులు చిన్న వయసులోనే బలవన్మరణాలకు పాల్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు. ఇలాంటి వాటిని యోగాతో నివారించవచ్చన్నారు.
"యోగా 5 వేల ఏళ్ల క్రితం నాటి సంప్రదాయం. యోగా కేవలం వ్యాయామం కాదు... అంతకు మించింది. యోగా ఒక ఫిలాసఫీ, క్రమశిక్షణ. యోగా అంటే ఏకం కావడం. ప్రాథమికంగా మనస్సు, శరీరం ఏకం కావడానికి యోగా దోహదపడుతుంది. సమతుల్యత, దయ, సమానత్వం, శాంతి, సామరస్యాన్ని చెప్పే శాస్త్రం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. సానుకూలంగా ప్రపంచాన్ని ఏకం చేయగలిగినందుకు సంతోషంగా ఉంది."
-ఎం వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి
దిల్లీలో కుటుంబసమేతంగా యోగాను జరుపుకున్నారు వెంకయ్యనాయుడు. పద్మాసనం, ప్రాణాయామం, సూర్య నమస్కారం వంటి ఆసనాలు వేశారు.
ఇదీ చూడండి: గ్రహణ సమయం.. సూర్యుడిని మింగేస్తున్న చంద్రుడు