పట్టణాల్లో వ్యర్థాల సేకరణ తీవ్ర సమస్యగా మారింది. ఈ తరుణంలో చెత్త సేకరణ కోసం వినూత్నంగా ఆలోచించి సాంకేతికత సాయంతో ఓ 'గార్బేజ్ క్యాన్' తయారు చేశారు కర్ణాటకకు చెందిన విశ్వనాథ్ పాటిల్. ఈ వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు సేకరించేందుకు ప్రత్యేకమైన వాహనాన్ని తయారు చేశారు. పర్యావరణహితమైన గార్బేజ్ క్యాన్ల తయారీతో పలువురి మన్ననలు పొందుతున్నారు.
స్వచ్ఛ-స్వస్థా..
కర్ణాటక హుబ్బళ్లికి చెందిన విశ్వనాథ్ పాటిల్ ఈ అధునాతన గార్బేజ్ క్యాన్‌ను తయారు చేయడమే కాకుండా.. 'స్వచ్ఛ-స్వస్థా' ట్రస్ట్ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం సేవలిందిస్తున్నారు.
"10 నుంచి 15 ఇళ్ల వరకు ఒక గార్బేజ్ క్యాన్‌ను ఏర్పాటు చేసుకుంటే చాలు. పర్యావరణహితం కోసం ఈ చెత్తబుట్టను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నాం. వ్యర్థాలు సేకరించే వాహనం నుంచి ఎలాంటి దుర్వాసన వంటి సమస్యలూ ఉండవు. ఇద్దరు వ్యక్తులు తోడ్పడితే చాలు.. చెత్త సేకరించడం, మళ్లీ గార్బేజ్ క్యాన్‌ను ఏర్పాటు చేయడం లాంటి అన్ని పనులూ ఈ వాహనమే చూసుకుంటుంది. చెత్త నుంచి వచ్చే నీరు కూడా బయటకు రాకుండా వాహనంలో ఓ ప్రత్యేకమైన ట్యాంక్ ఏర్పాటు చేశాం."
-విశ్వనాథ్ పాటిల్.
కొన్ని సంస్థల సాయంతో ఈ ప్రాజెక్టు తాను అనుకున్నట్లు రూపుదిద్దుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు విశ్వనాథ్. అన్ని మెట్రో నగరాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డులు