దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల్లోనూ కనీసం మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. కేరళ, మహారాష్ట్ర మినహా.. ఆయా రాష్ట్రాల్లో రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రై రన్ చేపట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది.
డ్రై రన్ నిర్వహణ ప్రక్రియపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దిల్లీలో 1994 నాటి పల్స్‌పోలియో నిర్వహణా కార్యక్రమం ఆధారంగా డ్రై రన్ విధి విధానాలు రూపొందించాలన్నారు. డ్రై రన్ జరిగే ప్రాంతాలను బ్లాక్-లెవల్ టాస్క్ ఫోర్స్.. నిరంతరం పర్యవేక్షిస్తుందని హర్షవర్ధన్ తెలిపారు. ఈ ప్రక్రియలో అధికారులు, వైద్య సిబ్బంది మధ్య పరస్పర సహకారంతో.. ఎప్పటికప్పుడు సందేహాల నివృతి చేయాలన్నారు. ఇందుకోసం టెలిఫోన్ సౌకర్యాన్ని మరింత విస్తరిస్తున్నట్టు చెప్పారు.
వారికి ప్రత్యేక శిక్షణ..
వ్యాక్సినేషన్లో పాలుపంచుకునే ఆరోగ్య కార్యకర్తల జాబితా సిద్ధమైనట్లు తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి. కొవిడ్ ప్లాట్‌ఫాంలో త్వరలోనే అప్లోడ్ చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల మాదిరిగానే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి వారిని వ్యాక్సినేషన్ కోసం సిద్ధం చేసినట్టు వివరించారు. జాతీయ స్థాయిలో 2వేల మందికి శిక్షణ ఇచ్చాక.. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ శిక్షణ అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఒక్క మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్