పాలన దక్షత, అపార మేధస్సుతో దేశాన్ని ప్రగతి ప్రథంలో నడిపించిన పీవీ నరసింహారావు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకత చాటుకున్నారు. మామూలు కుటుంబంలో పుట్టి.. దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగిన పీవీ బాల్యం, చదువు ఎలా సాగింది? ఆయన రాజకీయాల వైపు ఎలా ఆకర్షితుడయ్యారు? వందేమాతరం ఉద్యమానికి మద్దతుగా ఆయన ఏం చేశారు. ఆ వివరాలు మీకోసం..
వరంగల్ జిల్లా లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించారు పీవీ. తల్లి రుక్మాబాయమ్మ. తండ్రి సీతారామారావు. తర్వాత కరీంనగర్‌లోని వంగరకు చెందిన పీవీ బంధువులు ఆయనను దత్తత తీసుకున్నారు. పదేళ్ల వయసుకే సత్యమ్మతో వివాహం జరిగింది. కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య, హన్మకొండలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ఆ సమయంలోనే పీవీ జీవితం కొత్త మలుపు తీసుకుంది. అది జాతీయోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం. ఆ ప్రభంజనం వందేమాతర ఉద్యమరూపంలో తెలంగాణను తాకిన సమయం. అయితే జాతీయోద్యమం ఉప్పెనై కమ్మితే తన పీఠానికే ముప్పని భయపడ్డ నిజం నవాబు వందేమాతర గీతంపై నిషేధం విధించాడు.
అక్కడే రాజకీయ జీవితానికి పునాది..
అప్పట్లో తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతోంది. నిజాం ముష్కర పాలన, అతడి తాబేదార్ల దుష్కృత్యాలను చూసి పీవీలో ఉడుకురక్తం ఉరకలేసింది. అంతే ఆంక్షలు ధిక్కరించి 1938లో పీవీ 300మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతం ఆలపించారు. ఫలితంగా ఇంటర్మీడియట్‌లో కళాశాల నుంచి బహిష్కరించారు. ఒక రకంగా ఆ గేయాలాపనే పీవీ రాజకీయ జీవితానికి ప్రారంభ గీతికైంది. తర్వాతి కాలంలో దేశం దశదిశ మార్చే నాయకుడిని అందించింది.
కళాశాల నుంచి బహిష్కరణ వేటు తర్వాత ఇంటర్మీడియట్ ఎలాగైనా పూర్తి చేయాలి అనుకున్న పీవీ నాగ్‌పూర్ వెళ్లి అక్కడి కళాశాలలో చేరారు. అప్పటికే నాగ్‌పూర్‌లో స్వాతంత్య్ర ఉద్యమం ఉరకలేస్తోంది. ఆయనలో ఉప్పొంగే సమరోత్సాహానికి కొత్త ఊపునిచ్చింది. రాజకీయ అవగాహనను విస్తృతపరిచింది. ఆ ఊపులో 1939లో త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు పీవీ. సుభాష్‌చంద్రబోస్ వంటి దిగ్గజాల ప్రసంగాలు ఆయనలో ఉత్తేజం నింపాయి. అదే సమయంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు పీవీ.
ఉద్యమానికి పిలుపు..
పీవీ పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత న్యాయవాద విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో న్యాయవాదైన సుప్రసిద్ధ తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూర్గుల రామకృష్ణారావు వద్ద పీవీ జూనియర్ లాయర్‌గా చేరారు. న్యాయవాద వృత్తిలో ఓనమాలు దిద్దుకున్నారు. అప్పుడే స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనానికి ఉద్యమించండి అంటూ పిలుపునిచ్చారు. సంస్థానమంతటా సత్యాగ్రహ జ్వాలలు, నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే, గమ్యం ఒక్కటైనా... పోరాట పంథాలో తేడాలు వచ్చాయి. స్టేట్ కాంగ్రెస్ అతివాద, మితవాద గ్రూపులుగా చీలిపోయింది. స్వామి రామానంద తీర్థ అతివాద వర్గానికి.. బూర్గుల మితవాద బృందానికి నాయకత్వం వహించారు. వ్యక్తిగత అభిప్రాయాల కంటే సిద్ధాంత నిబద్ధతకే ప్రాధాన్యమిచ్చారు పీవీ. గురువు బాట విడిచి.. రామానంద తీర్థ వైపు మళ్లారు. యూనియన్ సైన్యం రంగ ప్రవేశంతో నిజాం నవాబు లొంగిపోయాడు. తెలంగాణ విముక్తమైంది. అలా హైదరాబాద్ స్వతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు.