వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ భద్రతా అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
భేటీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్య నేతలు ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ సహా తదితర నాయకులు పాల్గొన్నారు.
భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను భాజపా నాశనం చేస్తోందని ఆరోపించారు.
పాక్‌కు హెచ్చరిక...
సీడబ్ల్యూసీ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక పంపింది. శత్రువుపై పోరాడేందుకు దేశం మొత్తం సమైక్యంగా ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సైన్యాన్ని చూసి దేశం గర్విస్తోందని.... హింస, ఉగ్రవాదం వంటి చర్యలతో భారత్‌ను ఏమీ చేయలేరని తీర్మానంలో పొందుపరిచింది.
అభద్రతా భావం పెరిగింది
"దేశంలో భయం, అభద్రతా భావం పెరిగిపోతోంది. మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు, వ్యాపారవేత్తల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల వారి రాజ్యాంగ, చట్టపరమైన హక్కులపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. అన్ని ప్రభుత్వ సంస్థల అణిచివేత కొనసాగుతోంది. " అని మరో తీర్మానాన్ని ఆమోదించింది సీడబ్ల్యూసీ.