దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో కొవిడ్-19 కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 778 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 14 మంది మృతి చెందారు. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 6427కు చేరింది. రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది.
గుజరాత్లో 217 కేసులు
గుజరాత్లో ఇవాళ మరో 217 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2624కు చేరింది. 112 మంది మరణించారు.
మధ్యప్రదేశ్‌లో 24 గంటల్లో 100
మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 100 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,687కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది మృతి చెందారు. 203 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కర్ణాటకలో మరో 16 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది.
తమిళనాడులో..
తమిళనాడులో ఇవాళ కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 1683కు చేరింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందగా రాష్ట్రంలో మొత్తం 20 మంది బలయ్యారు. 750 మంది కోలుకున్నారు.
యూపీలో 1507 మందికి వైరస్
ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ ఒక్కరోజే 58 మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,507 మంది మహమ్మారి బాధితులు ఉన్నారు. ఇందులో 1,299 యాక్టివ్ కేసులు కాగా, 187 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 938 మందికి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి కారణంగా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు.
కేరళలో వైద్యపరిశీలనలో 23వేల మంది
కేరళలో మరో 10 మంది వైరస్ బారిన పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. మొత్తం 23 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి గ్రీన్జోన్లో ఉన్న కొట్టాయం ప్రాంతంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు.
పంజాబ్‌లో 6నెలల చిన్నారి మృతి
పంజాబ్‌లో కరోనా బారిన పడి 6 నెలల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 మందికి వైరస్ సోకగా, వీరిలో 65 మంది కోలుకున్నారు.
దిల్లీలో..
దేశ రాజధానిలో మొత్తం 2,248 మంది వైరస్ బారిన పడగా, 724 మంది కోలుకున్నారు. మరో 48 మంది మృతి చెందారు.
ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..
ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 46 మందికి వైరస్ సోకగా 23 మంది కోలుకున్నారు. అలాగే బిహార్‌లో 153 మంది వైరస్ సోకింది. జమ్ముకశ్మీర్‌లో 407 మంది కరోనా బాధితులు ఉన్నారు.