ఓ యువకుడు తన నాలుకను కోసి అమ్మవారికి అర్పించాడు. ఈ అరుదైన ఘటన ఉత్తర్ప్రదేశ్ బాందా నగరం బబేరూ పోలీస్స్టేషన్పరిధిలోని భాటీ గ్రామంలో జరిగింది. ప్రస్తుతం అతని నాలుకను అతికించే పనిలో ఉన్నారు వైద్యులు.
శనివారం రోజు స్థానిక దుర్గామాత గుడిలోకి వెళ్లిన ఆత్మారామ్ యాదవ్.. బ్లేడుతో నాలుకను కోసి అమ్మవారి పాదాల చెంత ఉంచాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. చికిత్స కోసం అడగగా ఆ వ్యక్తి నిరాకరించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
'తనను దేవుడు ఆవహించాడని, తలను అర్పిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత కలలోకి వచ్చి చెప్పింది. కానీ తన తల్లి వద్దని ప్రాధేయపడింది, అందుకే తాను నాలుకను కోసి దేవికి అర్పిస్తున్నా'నని ఆత్మారామ్ యాదవ్ అన్న మాటలను ప్రత్యక్ష సాక్షి శ్యామ్సుందర్ యాదవ్ వివరించాడు.