ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ శనివారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తుండగా.. ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లులు ఆమోదం పొందాయి.
పబ్లిక్, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి పరిహారాన్ని వ్యక్తుల నుంచే రాబట్టే కీలక బిల్లు సహా అంటురోగాల నివారణ బిల్లు, గోవధ నిషేధ సవరణ వంటి బిల్లులకు నిమిషాల వ్యవధిలోనే ఆమోద ముద్ర పడింది. సీఏఏ వ్యతిరేకంగా యూపీలో ఆందోళనలు జరిగినప్పుడు ఆందోళనకారుల నుంచి పరిహారాన్ని రాబట్టారు. ఇందుకోసం అప్పట్లో యోగి సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తాజాగా దీనిపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టింది.
ప్రజల దృష్టి మరల్చేందుకు ఆందోళనలు..
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, శాంతిభద్రతలు, వరదలు తదితర అంశాలపై ఓ వైపు విపక్ష పార్టీ సభ్యులు బ్యానర్లతో నినాదాల మధ్యే ఈ బిల్లులకు ఆమోదం లభించింది. విపక్ష నేతల ఆరోపణలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
"కరోనా విషయంలోనూ, శాంతిభద్రతల విషయంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. ప్రజల దృష్టి మరల్చడానికే విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి." అని ఆదిత్యనాథ్ ఆరోపించారు.
యూపీ శాసనసభ స్వల్పకాలిక సమావేశాలు సోమవారం వరకు జరగాల్సి ఉండగా.. శనివారమే నిరవధిక వాయిదా వేశారు.
ఇదీ చూడండి: ట్రాన్స్జెండర్ల సమానత్వం కోసం జాతీయ మండలి