ఉత్తర్ప్రదేశ్ ఫరూఖాబాద్ కసారియాలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 20 మంది చిన్నారులను నిర్బంధించిన ఓ హత్యకేసు నిందితుడు సుభాష్ బాథమ్ కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు.
రూ.10 లక్షల రివార్డ్
ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసిన యూపీ పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందిస్తూ, రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందించనున్నట్లు యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కె అవస్థీ తెలిపారు.
పుట్టిన రోజు వేడుకలని...
నిందితుడు సుభాశ్ బాథమ్ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో నిన్న 20 మందికి పైగా చిన్నారులను నిర్బంధించాడు. అడగడానికి వెళ్లిన గ్రామస్థులపైనా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఓ వ్యక్తి గాయపడ్డాడు.
కొన్ని గంటల తరువాత, ఓ ఆరు నెలల పసికందును మాత్రం బాల్కనీ నుంచి తన పొరుగువారికి అప్పగించాడు. కాసేపటికే దుండగుడ్ని హతమార్చి ఆపరేషన్ను విజయవంతంగా ముగించారు.
ఇదీ చూడండి: బ్రెగ్జిట్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు