25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. వారి సేవలు రాష్ట్రంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనతో హోంగార్డులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నెల 15న ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల దృష్ట్యా ఏకంగా 25 వేల హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది.
అయితే ఇప్పుడు దీపావళి వంటి పండుగ రోజుల్లో సిబ్బంది అవసరముందని భావిస్తోంది ఆ ప్రభుత్వం. అందుకే వైఖరి మార్చుకుంది.
"పండుగ సీజన్ రానున్న నేపథ్యంలో హోంగార్డుల సేవలు రాష్ట్రంలో అనివార్యమని ఈ నిర్ణయం తీసుకున్నాం."
- అవినేష్ అవస్తి, యూపీ ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి
హోంగార్డులకు రోజువారీ జీతం రూ.500గా ఉండేది. సుప్రీం ఆదేశాలతో అది రూ.672కు చేరింది.
ఇదీ చూడండి:పోలీసుల బరువు, చుట్టుకొలతల లెక్క తేల్చే పనిలో ఎస్పీ