పిల్లల తలనీలాలు దేవుడికి సమర్పించడం హిందూ సంప్రదాయం. ఒక్కసారైనా గుండు చేయించకపోతే, బాలల ఆరోగ్యం బాగుండదని కొందరి నమ్మకం. ఉత్తర్‌ప్రదేశ్ ఫతేనగర్‌కు చెందిన ఓ రైతు కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తాడు. పిల్లల విషయంలోనే కాదు... గేదెల విషయంలోనూ పాటిస్తాడు. అందుకే తన గేదె దూడ తలనీలాలను సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు జయచంద్రసింగ్. వినడానికి వింతగా ఉన్నా ఇది నమ్మకతప్పని నిజం.
ఖాగా తాలూకా, సరోళి గ్రామానికి చెందిన జయచంద్ర.. ఏటా తన గేదెకు పుట్టిన దూడ జుట్టును కత్తిరించే 'భండార' వేడుకను నిర్వహిస్తున్నాడు. ఎరుపు రంగు ఓణి వేసిన దూడను బ్యాండు బాజాలతో ఊరంతా ఊరేగించి.. బంధు మిత్రుల సమక్షంలో దాని జుట్టు కత్తిరిస్తారు. ఆ సమయంలో మహిళలంతా జానపద పాటలు ఆలపిస్తారు.
అనంతరం విందు కార్యక్రమం జరుగుతుంది. ఈ సారి ఈ వేడుకలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 300 మంది తరలివచ్చారు. గేదె ఆరోగ్యం బాగుండేందుకే ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు చంద్రసింగ్.
"ఇదివరకు నా గేదెకు సంతానం కలిగిన కొద్ది రోజులకే ఆ దూడలు మరణించేవి. అందుకే దూడల తలనీలాలు సమర్పించే వేడుక నిర్వహిస్తున్నా. అలా తలనీలాలు తీస్తున్నప్పటి నుంచి నా గేదె ఆరోగ్యం బాగుంది. దాని బిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇప్పుడు పాలు కూడా అధికంగా ఇస్తోంది."
-జయచంద్రసింగ్, గేదె యజమాని
ఇదీ చదవండి:గుండె ఆగకముందే దానం చేసిన దేవుడు