దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార ఘటనలో దిల్లీ న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యేపై అపహరణ, అత్యాచారం సహా హత్య అభియోగాలున్నాయి.
గత ఆగస్టు నుంచి వాదనలు వింటున్న జిల్లా న్యాయాధికారి ధర్మేశ్ శర్మ డిసెంబర్ 16న తీర్పు ఇవ్వనున్నట్లు.. సీబీఐ, నిందితుల తరఫు న్యాయవాదుల తుది వాదనలు విన్న అనంతరం ప్రకటించారు. 2017లో బాధితురాలు.. మైనర్‌గా ఉన్న సమయంలో సెంగార్ ఆమెను అపహరించి అత్యాచారం చేశారని ఆగస్టు 9న వివిధ సెక్షన్ల కింద కోర్టు అభియోగాలు మోపింది.
2017 నుంచి...
2017లో బాధితురాలు ఎమ్మెల్యేపై కేసు పెట్టినప్పటి నుంచి నిందితులు ఆమె కుటుంబాన్ని వేధిస్తూ వచ్చారు. బాధితురాలి తండ్రిని 2018 ఏప్రిల్‌లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న చట్టం కింద అరెస్టు చేయగా.. ఆయన జ్యుడీషియల్ కస్డడీలో ఉన్న సమయంలో ఏప్రిల్ 9న మరణించాడు.
ఆ తర్వాత ఈ ఏడాది జులై 28న బాధితురాలు ప్రయాణిస్తోన్న కారును లారీ ఢీకొట్టగా.. తీవ్ర గాయాలతో ఆమె బయటపడింది. అయితే ఆమె బంధువులు ఇద్దరు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వెంటనే బాధితురాలిని లఖ్‌నవూ ఆస్పత్రి నుంచి దిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించారు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. ఆ అస్పత్రిలోనే ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
సెంగార్‌పై కేసులు...
ఈ ప్రమాదం తర్వాత స్థానిక న్యాయస్థానం సెంగార్‌తో పాటు అతని సోదరుడు అతుల్ సహా మరో 9 మందిపై హత్య కేసును నమోదు చేసింది. హత్యాయత్నం నేపథ్యంలో బాధితురాలు... అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి లేఖ రాశారు. లేఖలో ఆమె కోరిన విధంగా.. నిందితులపై లఖ్‌నవూ కోర్టులో నడుస్తోన్న ఐదు కేసులను దిల్లీ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కూడా సూచించింది.
ఈ కేసుకు సంబంధించి దిల్లీ కోర్టు 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అత్యాచారం కేసులో బాధితురాలి తల్లి ప్రధాన సాక్షిగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబానికి సీఆర్‌పీఎఫ్ బలగాలు రక్షణగా ఉన్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెంగార్‌ను గత ఆగస్టులో భాజపా తమ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ కేసును యూపీ సర్కారు సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణ పూర్తి చేసి దిల్లీ కోర్టులో వాదనలు వినిపించింది.
ఇదీ చూడండి: అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు