దేశవ్యాప్తంగా జూన్ 8 నుంచి కేంద్రం మరిన్ని లాక్డౌన్ మినహాయింపులు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. లాక్డౌన్ ప్రభావం ఎదుర్కొన్న సమాజం ఒక్కసారిగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుందని... అందువల్ల పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ మేరకు 'అన్లాక్-1: హ్యాండిల్ విత్ కేర్' పేరిట ఫేస్బుక్ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు వెంకయ్య. సడలింపుల తర్వాత లభించే స్వేచ్ఛను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
లాక్డౌన్ 4లో ఇచ్చిన సడలింపుల కారణంగా కేసులు గరిష్ఠ స్థాయిలో నమోదైన విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు. మే 18నుంచి దాదాపు ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు గుర్తించినట్లు చెప్పారు. మే 30న దాదాపు 8 వేల కేసులు బయటపడిన విషయాన్ని ప్రస్తావించారు.
"దేశంలో లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ విషయం(కేసులు పెరగడం) ఓ మార్గదర్శకాన్ని అందిస్తోంది. పునరుద్ధరణ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా అన్లాక్-1 ను జాగ్రత్తగా చేపట్టాలని సూచిస్తోంది."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
దేశవ్యాప్తంగా నిర్బంధం దాదాపుగా ఎత్తివేసినట్లేనని వెంకయ్య పేర్కొన్నారు. కేవలం కంటైన్మెంట్ జోన్లలోనే లాక్డౌన్ కొనసాగుతుందని అన్నారు. దేశంలో ఉన్న 6 వేల కంటైన్మెంట్ జోన్లన్నీ చాలా వరకు 13 నగరాల్లోనే ఉన్నాయని, 70 శాతానికిపైగా కేసులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి ఆంక్షల పరిధిలోకి వచ్చే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని పేర్కొన్నారు.
కరోనాతో పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ప్రశంసించారు వెంకయ్య. కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో మంచి ఫలితాలు రాబట్టినట్లు తెలిపారు. ఇప్పుడు అన్లాక్-1ని సైతం జాగ్రత్తగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ఇదీ చదవండి: పిడుగుల ధాటికి దెబ్బతిన్న తాజ్మహల్ ప్రాంగణం!