జల్ జీవన్ మిషన్ పేరిట జరుగుతున్న మోసాలను గుర్తించి వాటి వివరాలను తెలపాలంటూ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. ఇలాంటి మోసపూరిత చర్యలపై దృష్టి సారించి మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని ఆదేశించింది. పలువురి నుంచి ఫిర్యాదుల మేరకు సీబీఐ విచారణ జరపగా కోట్లు రూపాయల మేర మోసం జరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
"వివిధ రాష్ట్రాలో పని చేస్తున్న ఎన్జీఓలు జల్ శక్తి మిషన్ పేరిట ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఎన్జీఓలు ఈ మిషన్లో ప్రజలకు పనులు కల్పిస్తామంటూ అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నాయి. సీబీఐకి ఫిర్యాదు చేయాలని నేను అధికారులను ఆదేశించా. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది."
-గజంద్ర సింగ్ శేఖావత్, కేంద్ర జల్ శక్తి మంత్రి
దిల్లీలో ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్జీఓ వ్యవస్థాపకుడు సురేశ్ కుమార్ వర్మ, మేనేజర్ సుభాష్ సింగ్లను అరెస్టు చేశారు. వీరి నుంచి అవగాహన ఒప్పందానికి సంబంధించిన పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కాంట్రాక్టుల ద్వారా నిందితులు కోట్ల రూపాయల మేర లబ్ధి పొందినట్లు విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో ఎటువంటి ఫిర్యాదులున్నా తమకు తెలియజేయాలని పలు రాష్ట్రాలను ఆదేశించారు జల్ శక్తి మంత్రి.