పౌరసత్వ చట్ట సవరణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జనవరి 15న కేరళలో పర్యటించనున్నారు. అయితే పౌర చట్టంపై తమ వ్యతిరేకతను అమిత్ షాకు నిరసనల ద్వారా తెలుపుతామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎమ్ఎల్) ప్రకటించింది. లక్ష మంది కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి రోడ్లపై షాకు స్వాగతం పలుకుతారని తెలిపింది.
"మధ్యాహ్నం 3గంటల నుంచి 4 గంటల వరకు నిరసన జరుగుతుంది. అందరూ నల్ల దుస్తులు ధరించి ఆందోళన చేపడతారు."
--- ఐయూఎమ్ఎల్ ప్రకటన.
అమిత్ షా ఈ నెల 15న తొలుత కరిప్పుర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. షా నిర్వహంచాల్సిన సభ.. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరం. ఈ నేపథ్యంలో విమానాశ్రయం నుంచి 35 కి.మీ వరకు తమ కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడతారని ఐయూఎమ్ఎల్ స్పష్టం చేసింది.
ఐయూఎమ్ఎల్ ప్రకటన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రమంత్రిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణం వద్దకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి : దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?