ఆరుగాలం కష్టపడే రైతు ఇక తనకిష్టమైన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ లభించనుంది. తన ఉత్పత్తికి మరెవరో ధర నిర్ణయించడంతో శ్రమకు తగ్గ ఫలానికి దూరమవుతున్న అన్నదాతకు ఆ కష్టం తీరనుంది. రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందుకోసం జారీ చేసే రెండు అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌లు), ఒక చట్టసవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.
"వ్యవసాయ సంస్కరణలతో సానుకూల ప్రభావం చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవసాయ సంస్కరణలతో గ్రామీణ భారతం రూపాంతరీకరణ చెందుతుంది. ఒకే భారత్-ఒకే వ్యవసాయ మార్కెట్ అన్నది సాకారం దాల్చుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి, వివాదాల పరిష్కారానికి తగిన వ్యవస్థలు ఏర్పాటవుతాయి. వ్యాపారులతో లావాదేవీలు నిర్వహించేటప్పుడు రైతులకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. వారి ప్రయోజనాలకు భద్రత ఉంటుంది."
-ప్రధాని నరేంద్ర మోదీ
- రైతులు ఇకమీదట తమ పంటలను ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన ధరకు విక్రయించుకొనే వీలు.
- పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి రైతులు కుదుర్చుకొనే ఒప్పందాలకు చట్టబద్ధత.
- నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి చిరుధాన్యాలు, నూనెగింజలు, వంటనూనెలు, ఉల్లి, బంగాళా దుంపలను తొలగించి నిల్వల పరిమితులపై ఆంక్షల ఎత్తివేత.
ఈ మూడు నిర్ణయాలూ రైతులకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుతాయని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
ఈ-వ్యాపారానికి వెసులుబాటు
ప్రస్తుతం మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు మాత్రమే పంటలు అమ్మాల్సి ఉంది. వారు చెప్పిన ధరకే విక్రయించక తప్పని పరిస్థితి. దీన్ని తొలగిస్తూ ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహం, సదుపాయ అత్యవసర ఆదేశాల’ను ప్రభుత్వం తీసుకురానుంది. దీంతో రైతులు ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఎలక్ట్రానిక్ వేదికపైనైనా తనకు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. ఈ వ్యవహారం అంతా మండీ బయటే జరుగుతుంది. ఇందులో ఎలాంటి పన్నులూ, తనిఖీలు ఉండవు. అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాన్‌కార్డ్ ఉన్న ఎవరైనా రైతుల నుంచి కొనుగోళ్లు చేయొచ్చు. ఈ-ప్లాట్‌ఫామ్స్ తయారు చేసుకొని సరకును విక్రయించుకోవచ్చు. సరకు కొన్నరోజు నుంచి మూడు రోజుల్లోపు వ్యాపారులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమయితే కోర్టు బయటే పరిష్కారం చేసుకోవాలి.
ధరలపై చట్టబద్ధ ఒప్పందాలు
పంటలు వేయడానికి ముందే రైతులు ఆహారశుద్ధి పరిశ్రమలు, టోకు వర్తకులు, అగ్రిగేటర్లు, ఎగుమతిదారులతో ధరలపై ఒప్పందం చేసుకోవచ్చు. ఈ ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించేలా 'వ్యవసాయదారుల (సాధికారిత, రక్షణ) ధరల హామీ, క్షేత్ర సేవల అత్యవసర ఆదేశాలు' తీసుకురానుంది. ఉదాహరణకు ఒక పంట కిలో రూ.10కి విక్రయించడానికి రైతు, వ్యాపారికి ఒప్పందం కుదిరితే తదుపరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ వ్యాపారి రూ.10కి సదరు పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పంట వచ్చిన తర్వాత ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరలోనూ రైతుకు భాగం ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యాపారులే ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులపై రవాణా భారం ఉండదు. రైతుల భూమికి పూర్తి భద్రత ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థమైన వ్యవస్థ ఉంటుంది.
నిల్వలపై పరిమితుల ఎత్తివేత
ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్న చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, ఆలూలను ఆ జాబితా నుంచి తొలగించేందుకు నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించనుంది. దేశంలో ఆహార వస్తువులకు కొరత ఉన్న సమయంలో అక్రమ నిల్వలు ఉంచకుండా తీసుకొచ్చిన ఈ చట్టం మిగులు నిల్వలున్న ప్రస్తుత పరిస్థితులకు సరిపోకపోవడంతో నిబంధనలను మార్చనుంది. ఫలితంగా ప్రైవేటు పెట్టుబడిదారుల్లో ఇప్పటి వరకు ఉన్న భయాలు తొలగిపోయి రైతుల నుంచి ఈ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి వీలవుతుంది. పర్యవసానంగా శీతల గిడ్డంగులు, గోదాములు, ఆహారశుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మరికొన్ని నిర్ణయాలు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్, మంత్రుల ఆధ్వర్యంలో ప్రాజెక్టు డెవలప్‌మెంట్ సెల్ ఏర్పాటు...
- కోల్‌కతా నౌకాశ్రయానికి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరు...
- గాజియాబాద్‌లోని భారతీయ వైద్య ఔషధ గ్రంథ ప్రయోగశాల, హోమియాపతి ఔషధ గ్రంథ ప్రయోగశాలల విలీనాలకు ఆమోదం.
మద్దతు ధరలు కొనసాగుతాయి
మార్కెటింగ్‌లో సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ వరి, గోధుమలకు మద్దతు ధరలు నిర్ణయించడం ఎప్పటిలాగానే కొనసాగుతుందని వ్యవసాయ మంత్రి తోమర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పక్షంలోనే లక్ష.. మొత్తం 2 లక్షలు దాటిన కేసులు