కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షమైన జేడీ(యూ)కు స్థానం కల్పించడం కోసం ప్రధాని మోదీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని వెల్లడించాయి. కలిసి పోటీ చేసినా మంత్రివర్గంలో చేరడానికి గతంలో జేడీ(యూ) సుముఖత చూపలేదు. ఒక్క కేబినెట్ మంత్రి పదవే ఇస్తామని తెలపడం వల్ల జేడీ(యూ) అప్పట్లో తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. తాజాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ సహాయ మంత్రి పదవి, మరో రెండు సహాయ మంత్రుల పదవులు ఇవ్వడానికి భాజపా ముందుకు రావడంతో అందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం.
భాజపా-జేడీ(యూ)ల మధ్య ఇటీవల సంబంధాలు మెరుగయ్యాయి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో జేడీ(యూ) మద్దతు తెలిపింది. అయితే జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కు మద్దతు ఇచ్చేది లేదని జేడీ(యు) అగ్రనేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీ తెచ్చే ఉద్దేశమేదీ లేదని ప్రధాని మోదీ ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య వివాదాలన్నీ ముగిసినట్టే. ఇక మహారాష్ట్రలో పొత్తు విఫలం కావడంతో శివసేనకు చెందిన అరవింద్ సావంత్ మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ పదవిని కూడా భర్తీ చేయాల్సి ఉంది.
ప్రకాశ్ జావడేకర్, హరదీప్ సింగ్ పురీ వంటి మంత్రుల చేతిలో పలు శాఖలు ఉన్నందున వారిపై భారం తగ్గించడానికి కొత్తవారిని తీసుకోవాల్సి ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణపై ప్రధాని కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.