కరోనాతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సంవత్సరం పాటు ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల వేతనాలు, భత్యాలు, పింఛన్ల చట్టం-1954కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు సామాజిక బాధ్యతగా తమ వేతనాలను తగ్గించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని(దాదాపు రూ.7 వేల 900 కోట్లు) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తం భారత ప్రభుత్వ సంచిత నిధికి చేరుతుందని పేర్కొన్నారు. వీటిని ఆరోగ్య సేవలకు, కరోనాపై మహమ్మారిపై పోరుకు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
ప్రధాని కీలక సూచనలు...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సంభాషించిన ప్రధాని మోదీ.. కీలక సూచనలు చేశారు. ప్రస్తుత సంక్షోభం.. మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, ఇదో మంచి అవకాశమని తెలిపారు మోదీ. ఇతర దేశాలపై ఆధారపడటం కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు సూచించారు.
''ప్రతి మంత్రిత్వ శాఖ తమకు సంబంధించిన 10 కీలక నిర్ణయాలు, 10 ప్రాధాన్యాంశాలు గుర్తించి యుద్ధప్రాతిపదికన ప్రణాళిక రూపొందించాలి. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. ప్రస్తుత సంక్షోభం మేకిన్ ఇండియా పథకాన్ని ప్రోత్సహించేందుకు ఓ చక్కని అవకాశం. అలాగే ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గుతోంది. ఆ దిశగా పనిచేయండి.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా.. అన్ని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికార యంత్రాంగానికి మంత్రులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. మంత్రుల సలహాలు, సూచనలు ప్రస్తుతం కొవిడ్‌ను ఎదుర్కోవడానికి ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
పంటకోత సమయంలో రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని. సహజ వనరుల వాడకాన్ని పెంచడం వంటి విదేశాల్లో అవలంబించే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేటి మంత్రిమండలి, మంత్రివర్గ సమావేశాలు జరగడం విశేషం. దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి.