త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, బంగాల్, కేరళ, అసోంపై వార్షిక బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించింది కేంద్రం. ఆయా రాష్ట్రాలకు జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి.. రూ. 2.5 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల వారీగా..
- తమిళనాడులో 3,500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.1.03 లక్షల కోట్లు
- కేరళలో 1,500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.65 వేల కోట్లు
- బంగాల్లో 675 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.95వేల కోట్లు
- అసోంలో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.3,400 కోట్లు
రూ.5.35 లక్షల కోట్ల విలువైన భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 13వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు నిర్మల. 2022 నాటికి మరో 8,500 కిలోమీటర్ల రోడ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి కారిడార్‌లో భాగంగా అదనంగా 11,000 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.5వేల కోట్ల విలువైన ఐదు ఆపరేషనల్ రోడ్డు ప్రాజెక్టులను జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి బదిలీ చేయనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. సుమారు రూ.7వేల కోట్లు విలువైన విద్యుత్తు ట్రాన్స్మిషన్ ఆస్తులు.. జాతీయ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగిస్తామన్నారు.
టైర్-2, టైర్-3 పట్టణాల్లోని విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో 2021-22 ఏడాదికి గాను రూ.2 వేల కోట్ల విలువైన ఏడు నౌకాశ్రయ ప్రాజెక్టులను ప్రధాన పోర్టుల్లో చేపట్టనున్నామని వెల్లడించారు.
టీ-కార్మికుల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు
ఎన్నికలు జరగనున్న అసోం, బంగాల్ రాష్ట్రాల్లోని తేయాకు పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వారికోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, వారి పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరెంట్, గ్యాస్ విషయంలో సామాన్యుడికి కొత్త శక్తి