సీబీఎస్ఈ సిలబస్‌లో కొన్ని కీలక అంశాలను తొలగించడంపై విమర్శలను కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తిప్పికొట్టారు. కరోనా నేపథ్యంలో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించామని, దీన్ని తప్పుగా చిత్రీకరించడం తగదని హితవు పలికారు.
ఓ ప్రత్యేక భావజాలాన్ని ప్రచారం చేయడం కోసమే... ప్రజాస్వామ్యం, బహుళత్వం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం సహా పలు అంశాలను తొలగించారని పలువురు విద్యావేత్తలు విమర్శలు గుప్పించారు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రమేశ్ పోఖ్రియాల్.
ఈ సంవత్సరానికే...
పాఠ్యాంశాల తగ్గింపు ఈ విద్యా సంవత్సరానికే వర్తిస్తుందని... వచ్చే ఏడాది నుంచి పూర్తి సిలబస్ యథావిధిగా ఉంటుందని రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం మేర సిలబస్‌ను తగ్గించామని ఆయన పేర్కొన్నారు.
విద్యారంగానికి చెందిన నిపుణులు, విద్యావేత్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న పోఖ్రియాల్... ఈ విద్యను రాజకీయాలతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.