శునకాలకు పుట్టిన రోజులు చేయడం.. వాటికి కానుకలు ఇవ్వడం వంటివి ఇటీవల కర్ణాటక వార్తల్లో నిలిచాయి. అచ్చం అలాంటి ఘటనే ఉడుపిలో జరిగింది. ఓ ఆవుకు సీమంతం చేశారు హోసబెళ ఆశ్రమవాసులు. శేష జీవితాన్ని హాయిగా గడుపుతున్న కొంతమంది వృద్ధులు.. వారితోనే పాటు ఉన్న 'గౌరి' అనే గోవుకు ఘనంగా సీమంతం జరిపించారు.
అచ్చం మనిషికి చేసినట్లే...
మనుషులకు జరిపినట్లే గోవుకు సీమంతం వేడుకలు చేశారు ఆశ్రమవాసులు. గౌరికి మంగళ స్నానం చేయించి.. అనంతరం దానిపై పచ్చని వస్త్రం(చీర) వేశారు. బొట్లు పెడుతూ.. దానికి నచ్చిన ఆహారాన్ని తినిపించారు. కొందరు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించి, మూగజీవులపై వారి పెద్ద మనుసు చాటుకున్నారు.
గాయాలతో..
20 రోజుల క్రితం మణిపాల్ జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర గాయాలతో ఉన్న ఆవును చూసి.. జిల్లా సిటిజన్ కమిటికీ సమాచారం అందిచారు స్థానికులు. దీంతో హోసబెళకు ఆశ్రమంలో ఆవుకు రక్షణ, వసతి కల్పించారు అధికారులు. అప్పటి నుంచి ఆశ్రమ కన్వీనర్ వినయచంద్ర.. గౌరి ఆలనపాలన చూసుకుంటున్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆవుకు.. నడిచేందుకు వీలుగా కృత్రిమ కాలును అమర్చారు. ఓ పరికరాన్ని కూడా రూపొందించి.. దాని సాయంతో నడిపిస్తున్నారు.
ఇదీ చూడండి: కుక్కకు బర్త్ డే గిఫ్ట్‌గా 250 గ్రాముల గోల్డ్ చైన్