ఉద్ధవ్ ఠాక్రే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహారాష్ట్ర వచ్చిన ప్రధానికి.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
భాజపా కూటమిని వీడిన శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్ర గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ, ఠాక్రేలు తొలిసారి కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించికుంది.
పుణె విమానాశ్రయంలో ఠాక్రేతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్లు ప్రధానికి స్వాగతం పలికారు.
ప్రధానిని కలిసిన తర్వాత.. ఉద్ధవ్ ఠాక్రే తిరిగి ముంబయి బయల్దేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పుణెలో మూడు రోజుల పాటు జరగనున్న 'నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్'.. కార్యక్రమానికి ప్రధాని మోదీ నేడు హాజరుకానున్నారు.