జమ్ము కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని భారత సైనిక స్థావరాలు, గ్రామాలే లక్ష్యంగా వరుసగా మూడోరోజు కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో చేసిన ఈ దాడిలో స్థానిక వృద్ధుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ కవ్వింపు చర్యలను భారత్ తిప్పికొట్టింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డట్లు ఆ దేశ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్, మేజర్ అసిఫ్ ఘఫూర్ ట్విట్టర్లో స్పష్టం చేశారు.
మూడు రోజుల వ్యవధిలో పాక్ సైన్యం మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని జమ్ముకశ్మీర్ రక్షణ ప్రతినిధి తెలిపారు. తాజా కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. పాక్ కాల్పులను భారత సైన్యం ప్రతిసారి సమర్థవంతంగా తిప్పికొడుతోందని వెల్లడించారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల... మెరుగైన చికిత్స కోసం జమ్ములోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.
"షాపుర్, కస్బా సెక్టార్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, షెల్లింగ్లు, మోర్టార్లు ప్రయోగించి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.-రక్షణ శాఖ ప్రతినిధి.
శుక్ర, శనివారాల్లోనూ షాపుర్, కిర్ని, బాలాకోట్ సెక్టార్లను లక్ష్యంగా చేసుకుంటూ పాక్ కాల్పులు జరిపింది.