భారత్లో మరోమారు కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధరణ కావడం వల్ల దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5కు చేరింది.
మొదటి మూడు కేసులు కేరళకు చెందినవి కాగా... తాజా కేసులు దేశ రాజధాని దిల్లీ, తెలంగాణలో నమోదయ్యాయి. ఇటలీ నుంచి దిల్లీకి వచ్చిన వ్యక్తితో పాటు.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికీ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీ వ్యక్తికి స్థానిక ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది.
ఈ పూర్తి వ్యవహారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ స్పందించారు. వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
"దిల్లీ, తెలంగాణలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారు ఇటలీ, దుబాయి నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు భారత్లో మొత్తం 5 కేసులు నిర్ధరణ అయ్యాయి. 21 విమానాశ్రయాలు, 77 చిన్న, ప్రధాన నౌకాశ్రయాల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 5,57,431 మంది, నౌకాశ్రయాల్లో 12,431 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించాం."
- డా. హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.
మరిన్ని దేశాలపై ఆంక్షలు
తాజా కేసుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి. ప్రయాణ మార్గదర్శకాల్లో భాగంగా చైనా, ఇరాన్ దేశాలకు ఈ-వీసాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. చైనా, ఇరాన్, కొరియా, సింగపూర్, ఇటలీ దేశాలకు అత్యవసరమైతే తప్పా ప్రయాణించవద్దని సూచించారు.
89వేల కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 89 వేల మందికి కరోనా సోకగా.. ఒక్క చైనాలోనే 80,026 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు