సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అయోమయం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదని.. కానీ వినియోగించడానికి ఎలాంటి ప్రోత్సాహం లభించదని తెలిపింది.
2022లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిస్థాయిలో నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని పరిశ్రమల సంఘాలు కోరాయి. ఇదే విషయంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వీకే జిందాల్.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మా ఆశయం కాదు. వాటి వాడకానికి ప్రోత్సాహం లభించకుండా చేయటమే ముఖ్య లక్ష్యం."
-వీకే జిందాల్
ప్రత్యామ్నాయ మార్గాలు
వాడుకలో ఉన్న ప్లాస్టిక్‌ను ప్రత్యామ్నాయ అవసరాలు తీర్చే విధంగా పలు సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
"భారత్‌లోని 46 సిమెంట్ పరిశ్రమలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇవి పునరుత్పత్తి చేయలేని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధనం తయారు చేస్తాయి. జాతీయ రహదారుల నిర్మాణంలోనూ ప్లాస్టిక్ వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 10 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయి."
-వీకే జిందాల్
ఉద్యోగుల భవిష్యత్తు..
ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో 10 వేల తయారీ సంస్థలు మూతపడనున్న కారణంగా 4.5 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరికి మరో పర్యావరణ హితమైన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
"అన్ని కర్మాగారాలు ప్లాస్టిక్ పరిశ్రమలు కాదు. 90 శాతం ప్లాస్టిక్‌ను వేరే రంగాలకు వాడతారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరిశ్రమలు పరిమితమైనవి. ఇవి తగ్గిపోతే చాలా సంస్థలు ఉద్భవిస్తాయి. కాగితపు సంచులు వంటి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తాయి."
-వీకే జిందాల్
పరిశ్రమల మనుగడ
నివేదికల ప్రకారం భారత్‌లో ఏటా 140 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. అఖిల భారత ప్లాస్టిక్ తయారీదారుల సంఘం లెక్కల ప్రకారం.. దేశంలో 50 వేల ప్లాస్టిక్ కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 3.5 లక్షల ఆదాయం వస్తోంది.
ఈ విషయంపై గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది.
"స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించినప్పుడు అసాధ్యమని భావించాం. కానీ ఇప్పుడు ఫలితాలు చూడండి. ప్రజల్లో పారిశుద్ధ్యం పెరిగింది. భారత్ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా ఆవిర్భవించింది."
-వీకే జిందాల్