రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతోంది. అయితే బాధితురాలి ఆరోగ్యం కొంత మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. తలకు గాయం కాలేదని, కానీ బాధితురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉందన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని వివరించారు.
రాయ్‌బరేలీ జైలులోని తమ బంధువును చూసేందుకు... ఆదివారం బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది బయలుదేరారు. దారి మధ్యలో వారి వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
బాధితురాలు 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటోంది. ఘటనలో గాయపడ్డ న్యాయవాది ఆరోగ్యం నిలకడగా ఉంది.
నేడు సుప్రీం విచారణ...
ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబం రాసిన లేఖను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. నేడు ఈ కేసుపై వాదనలు విననుంది. సెన్‌గర్ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఈ నెల 12న సీజేఐకు లేఖ రాసింది ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబం.
'అన్ని ఆధారాలున్నాయి...'
రోడ్డు ప్రమాదంపై బాధితురాలి మేనమామ మహేష్ సింగ్ స్పందించారు. బాధితురాలిపై భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌గర్ అత్యాచారం చేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.
రెండు దశాబ్దాల క్రితం సెన్‌గర్ తమ్ముడిపై దాడి కేసులో మహేష్ జైలులో ఉన్నాడు. మహేష్‌ను కలవడానికి ఆదివారం ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, కుటుంబ సభ్యులు రాయ్‌బరేలికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో మహేష్ భార్య ఒకరు.
మహేష్ భార్య అంత్యక్రియలు బుధవారం పటిష్ఠ భద్రత మధ్య గంగానది వద్ద జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహేష్ పెరోల్‌పై విడుదలయ్యాడు.
మంత్రి అల్లుడిపై ఎఫ్ఐఆర్...
రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపట్టింది. సెన్గర్తో సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఉత్తరప్రదేశ్ వ్యవసాయ మంత్రి రణవేంద్ర ప్రతాప్ అల్లుడు అరున్ సింగ్ పేరు కూడా ఉంది.
ఎఫ్ఐఆర్లో తన పేరు ఉండటాన్ని అరున్ సింగ్ తీవ్రంగా ఖండించారు. సంబంధం లేని విషయంలో ఇరికించడానికే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అరున్ సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు.
భాజపాపై తీవ్ర విమర్శలు...
ఉన్నావ్ బాధితురాలి అత్యాచారం, రోడ్డు ప్రమాదం ఘటనలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది భాజపా. తాజాగా యూపీ మంత్రి అల్లుడిపై ఎఫ్ఐఆర్ నమోదవడం వల్ల ఈ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని సర్వత్రా డిమాండ్ పెరిగింది.
ఇదీ చూడండి- వైరల్: కేకును తుపాకీతో పేల్చి బర్త్‌డే సంబరాలు