అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 24-25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా భారత్‌లో పర్యటిస్తారని స్పష్టం చేసింది. భారత్-అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ పర్యటనతో మరింత బలపడుతుందని అగ్రరాజ్యం విశ్వాసం వ్యక్తం చేసింది.
"దిల్లీతో పాటు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రంప్ పర్యటించనున్నారు. మహాత్ముడి జీవితంలో ఆ ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించింది."
--- శ్వేతసౌధం ప్రకటన.
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు డొనాల్డ్ ట్రంప్.
వాణిజ్య ఒప్పందం...!
ఈ పర్యటనతో భారత్-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఓ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి- రికార్డు: 5 గంటల్లోపే న్యూయార్క్ టూ లండన్