గుజరాత్ గాంధీనగర్‌లో ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ కలసి భారీ రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోకు 'భిన్నత్వంలో ఏకత్వం' అని పేరు పెట్టారు.
ఈ నెల 24 మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన పర్యటన అధికారికంగా మొదలు కానుంది. విమానాశ్రయంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మోదీతో కలసి ట్రంప్ 1 గంటకు రోడ్ షోలో పాల్గొంటారు.
సబర్మతిలో గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోటేరాకు మధ్యాహ్నం 2.20 గంటలకు మోదీ-ట్రంప్ చేరుకుంటారు.
'నమస్తే ట్రంప్' కార్యక్రమం ముగిసిన అనంతరం ట్రంప్ జంట అహ్మదాబాద్ విమానాశ్రయానికి సాయంత్రం చేరుకుంటారు. వారికి వీడ్కోలు పలికి మోదీ దిల్లీకి బయలుదేరతారు.
ట్రంప్ పర్యటనలో తాజ్ మహల్ సందర్శన కలపడం వల్ల చాలా కార్యాక్రమాలను మళ్లీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. వీటితో పాటు ఉన్నతస్థాయి వాణిజ్య బృందం ట్రంప్‌తో పాటు పాల్గొంటారు.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఇరు దేశాల అధికారులు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా వారికి అన్ని విధాలా మేము సహకరిస్తున్నాం." - నితిన్ పటేల్, గుజరాత్ ఉపముఖ్యమంత్రి.
70 లక్షలు కాదు లక్షే..!
అహ్మదాబాద్‌లో 22 కిమీ ట్రంప్ రోడ్ షోకు లక్ష మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే అహ్మాదాబాద్ రోడ్ షోలో తనకు స్వాగతం పలకడానికి దాదాపు 70 లక్షల మంది వస్తున్నట్లు మోదీ చెప్పారని ఇటీవల ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు.
అహ్మదాబాద్ మొత్తం జనాభాయే 70 నుంచి 80 లక్షలు. ఈ నేపథ్యంలో రోడ్ షో లో పాల్గొనేవారి సంఖ్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు మాత్రం లక్ష మంది వరకు రోడ్ షోకు హాజరవుతారని స్పష్టం చేశారు.