టీఆర్పీ కుంభకోణంలో ముంబయి పోలీసుల నుంచి సమన్లు అందుకున్న రిపబ్లిక్ టీవీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) శివ సుబ్రమణియం సుందరం విచారణకు గైర్హాజరయ్యారు. ఈ అంశంపై తమ టీవీ ఛానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్న కారణం చూపుతూ విచారణకు హాజరుకాలేదు. వారంలోగా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని, అంతవరకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయొద్దని కోరినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కేసులో సమన్లు అందుకున్న మాడిసన్ వరల్డ్, మాడిసన్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్, ఎండీ సామ్ బలసారా శనివారం విచారణకు హాజరయ్యారు.
సీఐయూ విచారణ
ఫేక్ రేటింగ్ పాయింట్స్ కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ) విచారణ జరుపుతోంది. రిపబ్లిక్ టీవీతో పాటు రెండు మరాఠీ ఛానెళ్లు అయిన ‘ఫక్త్ మరాఠీ’, ‘బాక్స్ సినిమా’తో పాటు రెండు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఇప్పటికే రెండు మరాఠీ ఛానెళ్ల యజమానులు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేటింగ్ ఏజెన్సీ అయినా బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ఈ మోసం వెలుగు చూసినట్లు ముంబయి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇదీ చదవండి:కొండచిలువ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు!