భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మిషన్ గగన్‌యాన్‌పై కరోనా ప్రభావం పడింది. 2021లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం సిద్ధమవుతున్న వ్యోమగాముల శిక్షణ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. గగన్‌యాన్ కోసం నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలోని యూరీ గగారిన్ పరిశోధనా కేంద్రంలో శిక్షణ అందిస్తున్నారు.
కొవిడ్ కారణంగా అక్కడ కూడా లాక్‌డౌన్ విధించగా వారం రోజులుగా పరిశోధనా కేంద్రం మూతపడి శిక్షణ నిలిచిపోయింది. నలుగురు భారతీయ వ్యోమగాములు ప్రస్తుతం రష్యాలోని వసతి గృహంలో క్షేమంగా ఉన్నారని..ఈ నెలాఖరుకు శిక్షణ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య మిషన్ గగన్ యాన్ నిర్ధేశిత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.