కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ ఆందోళనలకు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సహా 10 కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.
" 2020 జులై 3న దేశవ్యాప్త నిరసనలను విజయవంతం చేసేందుకు అన్ని కార్మిక సంఘాలకు చెందిన శ్రామిక వర్గాలు పాల్గొనాలని పిలుపునిచ్చాం. నిరసనల తర్వాత దేశవ్యాప్త సాధారణ సమ్మె, సహాయ నిరాకరణ వంటి వాటిపై అన్ని కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటాం."
- కార్మిక సంఘాలు
దీర్ఘకాలికంగా నిర్వహించకుండా ఉన్న భారత కార్మిక సదస్సును వెంటనే నిర్వహించి.. 12 పాయింట్ల డిమాండ్లు, కార్మికులు, యూనియన్ల హక్కులు, ఉద్యోగాల కోత, వేతనాలు, ఉద్యోగ భద్రత, వలస కార్మికుల సమస్యలను పరిష్కరంచాలని ప్రభుత్వాన్ని కోరాయి యూనియన్లు. కార్మిక చట్టాలను నీరుగార్చి.. కార్మికులను బానిసత్వానికి గురిచేసే విధానాలను అంగీకరించబోమని స్పష్టం చేశాయి. ప్రభుత్వ రంగ విభాగాల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ అంతా బూటకమేనని, దానితో ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపించాయి.