ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి నేడు సమావేశం కానుంది. దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత లక్ష్యాలుగా ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అయిదవ, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జరిగే మొదటి పాలక మండలి భేటీ ఇది.
వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా ఈ సమావేశం చర్చించనుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతిభవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
మమత దూరం
నీతి ఆయోగ్‌కు రాష్ట్రాలు మద్దతు ఇచ్చేందుకు ఆర్థిక పరమైన అధికారాలు లేవన్న కారణంతో సమావేశానికి హాజరు కానని తెలిపారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ప్రధాని నేతృత్వంలో
నీతి ఆయోగ్ పాలక మండలికి అధ్యక్షుడిగా ప్రధాని వ్యవహరిస్తారు. ఆర్థిక, అంతర్గత వ్యవహారాలు, వాణిజ్యం, గ్రామీణ అభివృద్ధి మంత్రులు సభ్యులుగా ఉంటారు.
కిందటి సమావేశంలో చర్చించిన అంశాలపైనా సమీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి'