తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఇంటిని జయలలిత స్మారకంగా మార్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ప్రజలు అమ్మగా భావించే జయలలిత జ్ఞాపకార్థం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసం 'వేద నిలయాన్ని' స్మారకంగా మారుస్తామని ఇదివరకే ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి పళణిస్వామి. ఇప్పుడు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం.
జయలలిత మెమోరియల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి పళణిస్వామి నేతృత్వం వహించనున్నారు.
అనారోగ్యానికి గురై 75 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం 2016 డిసెంబర్లో తుదిశ్వాస విడిచారు జయలలిత. మెరీనా బీచ్‌లో రూ.50కోట్ల నిధులతో ఆమెకు ప్రత్యేక స్మారకాన్ని ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు.