కోల్‌కతాలో మంగళవారం అమిత్‌షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై... టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఘర్షణలకు తృణమూల్ కార్యకర్తలే కారణమన్న భాజపా ఆరోపణల్ని... టీఎంసీ తిప్పికొట్టింది. భాజపా కార్యకర్తలే సామాజిక సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చారన్నట్టుగా చూపిస్తున్న వీడియోను విడుదల చేసింది. తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని చెప్పారు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్.
బంగాల్ ఆత్మగౌరవాన్ని బయటి వ్యక్తులు కించపరిచారని ఆవేదన వ్యక్తంచేశారు డెరెక్. 'విద్యాసాగర్ పని ఖతం, జోష్ ఎక్కడుంది' అన్న నినాదాల ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయన్నారు. తృణమూల్ నేతలపై దాడి చేసేందుకు వీలుగా ఆయుధాలతో అమిత్‌షా రోడ్‌షోకు రావాలన్న భాజపా వాట్సాప్ సందేశం తమ వరకు చేరిందని వెల్లడించారు డెరెక్.
"మీరు ఎన్నికల ర్యాలీ చేయాలనుకుంటే వచ్చి చేయవచ్చు. కోల్‌కతా ఓ మహానగరం. ఎవరైనా రోడ్‌షో చేయవచ్చు. ర్యాలీలో చెలరేగిన అల్లర్లలో బయటివ్యక్తులు అరెస్టయ్యారని తెలుస్తోంది. మీరు బయటి వ్యక్తులను అరెస్టు చేశారని ఎందుకు అడుగుతున్నారు. తేజీందర్ భగ్గా ఎవరు? దిల్లీలో ఒకరిని కొట్టిన కేసులో నిందితుడు కాదా? మీరు బయట ప్రాంతాల్లోని గూండాలను తీసుకువచ్చి అల్లర్లు జరిపించారని ఇప్పుడు తెలుస్తోంది."
-డెరెక్ ఓబ్రయిన్, టీఎంసీ నేత
డెరెక్ ఆరోపణలపై సమాధానమిచ్చారు భాజపా నేత తేజీందర్ భగ్గా. అల్లర్లు చెలరేగిన స్థలానికి 500 మీటర్లలోపు తానున్నట్లు నిరూపించాలని డెరెక్‌కు సవాలు విసిరారు.
అసలు జరిగిందేమిటి...?
మంగళవారం రాత్రి భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్ లక్ష్యంగా కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడికి దిగారని సమాచారం. ఈ దాడితో భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ గొడవల్లో పక్కనే ఉన్న కళాశాలలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది.
ఇదీ చూడండి: బంగాల్లో హింసకు మమతే కారణం: అమిత్ షా