టైమ్ మ్యాగజిన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రచురితమైన "డివైడర్ ఇన్ చీఫ్" కథనంపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీని అపకీర్తి పాలుచేసేందుకు ఓ పాకిస్థానీ రచయిత ఆ కథనాన్ని రాశారని విమర్శించింది. లక్షితదాడులు చేయడం సహా ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా మోదీ నిలబెట్టడం వల్లే ఆ దేశానికి చెందిన రచయిత ఇలాంటి కథనాన్ని రాశారని మండిపడ్డారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.
"2014లోనూ కొన్ని విదేశీ పత్రికలు మోదీపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి కథనమే టైమ్ మ్యాగజైన్లో చూశా. అది రాసింది ఎవరు..? అది రాసిందో పాకిస్థానీ పౌరుడు. ఒక పాకిస్థానీ.. మోదీని విభజనకారుడు అంటారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తారు. రెండు లక్షితదాడులను మోదీ పాకిస్థాన్‌పై చేశారు. బాలాకోట్‌పై వాయుదాడి చేసి పాకిస్థాన్‌కు దీటైన సమాధానం చెప్పారు. ఇంత చేశాక పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని మనం అంచనా వేస్తాం. భారత సైన్యం, మోదీ దృఢ నిశ్చయాన్ని పాకిస్థాన్ ఏమీ చేయలేదు. ఇలాంటి కథనాలు రాసి మోదీకి చెడ్డపేరు తీసుకురావాలని పాకిస్థానీ రచయిత ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ వాటిని ట్వీట్ చేస్తున్నారు. " - సంబిత్ పాత్ర , భాజపా అధికార ప్రతినిధి
అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ తన మే 20వ తేదీ అంతర్జాతీయ సంచికలో మోదీపై వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. దానికి " ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్" అనే శీర్షికను మోదీ ఫొటోతో ముఖచిత్రంపై పెట్టింది.
ఇదీ చూడండి : పేదల కులమే నా కులం: మోదీ