అయోధ్యలో చారిత్రక రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు ఎకరాల భూమిని చదును చేసినట్లు వెల్లడించారు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, హిందూ సంస్థ నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్. ఆలయం నిర్మించే ప్రదేశంలో ఉన్న బారికేడ్లను తొలగించినట్లు చెప్పారు. గర్భగుడి స్థలంలో 6-7 అడుగుల లోతు తవ్వకం జరిపినట్లు పేర్కొన్నారు.
దినేంద్ర దాస్ను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో సభ్యునిగా కేంద్రం నియమించింది. జూన్ 8న ట్రస్టు క్యాంపు కార్యాలయాన్ని రామ మందిరం పక్కనే ప్రారంభించారు.
భూమిపూజ..
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ నిర్వహించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన మహంత్ నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది.
శివపూజ
ఆలయానికి కేటాయించిన రామ జన్మభూమి ప్రాంతంలోని కుబేర్ తిలా మందిరంలో శివుడికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లంకపై దాడికి ముందు రాముడు.. శివుడిని ప్రార్థించిన సంప్రదాయాన్నే రుద్రాభిషేక కర్మ అనుసరిస్తుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రత్యేక పూజల అనంతరం ఆలయానికి పునాది రాయి వేశారు.