ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ సివిల్ సర్వీస్ అధికారిణి పేరు ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె 13 ఏళ్ల కెరీర్లో 17 సార్లు బదిలీ అవటమే.
మేరట్‌లో ఏడాదిగా పనిచేస్తోన్న అమితా వరుణ్‌ను ప్రజాప్రయోజనం పేరుతో ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. అయితే స్థానిక స్పర్దానా భాజపా ఎమ్మెల్యేతో ఆమెకు వివాదాలు ఉన్నాయి. ఇదే ఆమె బదిలీకి కారణమని సమాచారం.
17 సార్లు...
13 ఏళ్ల కెరీర్లో అమితా వరుణ్ 17 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2007 బ్యాచ్‌కు చెందిన అమితా గత ఏడాది సెప్టెంబర్ నుంచి మేరట్ స్పర్దానా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈఓగా పనిచేస్తున్నారు.
స్థానిక రాజకీయ నాయకులకు ఆమె పనితీరు నచ్చక గత మూడేళ్లలో అమితాను 10 సార్లు బదిలీ చేయించారు. గత ఆదివారం బులంద్‌షెహర్‌లోని జహంగీరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
న్యాయ పోరాటం...
తరచుగా బదిలీలు రావడంపై ఆమె 2018లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు కోర్టు అండగా నిలిచింది.
"అధికారాన్ని ఉపయోగించి చట్టాల్లోని లొసుగులతో ఈ బదిలీలు చేశారు. పిటిషనర్ (వరుణ్) ఎక్కడా ఎలాంటి అవినీతికి పాల్పడినట్లు మాకు కనబడలేదు."
- హైకోర్టు
ఇరికించి...
స్పర్దానా మున్సిపల్ కార్పొరేషన్లో ఆమె ఈఓగా ఉన్న సమయంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి గుండెపోటుతో సెప్టెంబర్ 22న చనిపోయారు. అయితే ఆ ప్రాంత ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అనుచరులు ఆ ఉద్యోగి చనిపోవడానికి అమితా వరుణ్ వేధింపులే కారణమని ఆరోపించారు.
ఎమ్మెల్యే.. అమితాపై పలు ఆరోపణలు చేశారు. ఆమె లంచం తీసుకునేవారని ఇతర సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించేవారని విమర్శలు చేశారు. అయితే వీటిపై స్పందించిన అమితా.. ఎమ్మెల్యే తనను విధులు నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. తాను చెప్పినట్లు చేయాలని తనపై ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు అమితా వివరించారు.