కర్ణాటక ఉడిపి మూడుగలియారులో ప్రపంచంలోనే మొట్టమొదటి యోగ, నేచురోపతి (సర్వక్షేమ) ఆసుపత్రిని ప్రారంభించారు. పురాతన ఆలయ నిర్మాణ శైలిలో ప్రకృతి ఒడిలో ఈ వైద్యాలయం నిర్మించారు.
"యోగ, నేచురోపతి నేటి జీవితంలో అత్యవసరం. ప్రకృతి ఒడిలో పురాతన ఆలయ నిర్మాణశైలిలో ఈ ఆసుపత్రి నిర్మించాం. ఇది రోగులకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది."- డాక్టర్ వీరేంద్ర హెగ్డే, ధర్మస్థల ధర్మాధికారి
స్వామి వివేకానంద
ప్రపంచంలోనే ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహాన్ని యోగ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హెచ్ఆర్ నాగేంద్ర ప్రారంభించారు. దీని ఎత్తు 35 అడుగులు. దీనికి ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు.
"శాంతిని కోరుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. నేచురోపతి ఈ రోజు ప్రపంచమంతా వ్యాపించింది."
- హెచ్ఆర్ నాగేంద్ర, యోగ విశ్వవిద్యాలయం ఛాన్సలర్
ఆసుపత్రి ప్రత్యేకతలు
ప్రపంచంలో పురాతన ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించిన మొట్టమొదటి యోగా ఆసుపత్రి ఇది. ఆయుష్ విభాగంలో దేశంలో ఇదే మొదటి పర్యావరణ అనుకూల యోగా, ప్రకృతి వైద్యశాల. సముద్రతీరం పక్కన నిర్మించిన ఈ ఆసుపత్రిలో యోగా, ఆహారం, ఆధ్యాత్మికత, సంగీతం, పచ్చదనం, హాస్యం, నిశ్శబ్ద చికిత్స అన్నీ ఉంటాయి. సౌరవ్యవస్థ, సైకిల్ ట్రాక్లను కూడా నిర్మిస్తున్నారు.
ఈ ఆసుపత్రిలో వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యోగ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తారు.
ఇదీ చూడండి: కరోనా: ప్రజలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు