ఛత్తీస్గఢ్, బస్తర్ జిల్లాలో.. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. తమ బిడ్డల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో లౌడ్స్పీకర్లు పెట్టించి.. ఇంటివద్దే పాఠాలు చెప్పిస్తున్నారు భట్పాల్ గ్రామస్థులు.
ఆన్లైన్ కాదు.. ఆన్లౌడ్ స్పీకర్
ఛత్తీస్గఢ్లో ఎన్నో గిరిజన, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో.. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ ఉన్నా.. అటవీ ప్రాంతంలో సరిగ్గా సిగ్నల్ రాదు. దీంతో అలాంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావడం పెద్ద సవాలుగా మారింది. దీంతో భట్పాల్ గ్రామస్థులు.. జిల్లా పరిపాలనాధికారుల సహకారంతో ఇలా లౌడ్ స్పీకర్ క్లాసులు పెట్టించారు.
గ్రామంలో ఏడు చోట్ల ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4.30 గంటల నుంచి మరో రెండు గంటలు పాఠాలు వినిపిస్తున్నారు ఉపాధ్యాయులు. మాస్టారు పాఠాలు మొదలుపెట్టగానే.. ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు విద్యార్థులు. శానిటైజర్లు పూసుకున్న చేతుల్లో పుస్తకాలు పట్టుకుని. మాస్టారు చెప్పిందల్లా రాసేసుకుంటున్నారు.
కరోనా కాలంలో.. విద్యార్థుల భవిష్యత్తు నిలిపే ఈ ఆలోచనకు.. చుట్టుపక్కల గ్రామస్థులూ ఫిదా అవుతున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లౌడ్ స్పీకర్ క్లాసులు పెట్టించే యోచనలో ఉంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం.
ఇదీ చదవండి: మూగజీవి మౌనరోదన.. పేలుడు పదార్థం తిన్న వృషభం