ఝార్ఖండ్ విధానసభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రజలు.
విధుల్లో 40 వేల మంది..
17 నియోజకవర్గాల్లో మొత్తం 7,016 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 1,008 కేంద్రాలను సమస్యాత్మక, 543 పోలింగ్ స్టేషన్లను సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. సుమారు 40 వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. రాంచీ, హతియా, కాన్కే, బర్కతా, రామ్‌గర్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
బరిలో ప్రముఖులు..
ఈ ఎన్నికల్లో 309 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 56,18,267 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఈ విడత ఎన్నికలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ వికాస్ మోర్చా అధ్యక్షుడు బాబులాల్ మరండి (ధన్వార్ నియోజకవర్గం), విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ (కొడర్మ) బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహ్తో సిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ నెల 16, 20 తేదీల్లో నాలుగు, ఐదో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: అసమానతలే మానవాభివృద్ధికి అతిపెద్ద విఘాతం