బిహార్ అసెంబ్లీ తుది దఫా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శనివారం (నవంబర్ 7న) జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. సీమాంచల్ ప్రాంతంలో తుది విడత ఎన్నికలు జరగనుండగా.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
తుది దఫాలో ఉత్తర బిహార్‌లోని 19 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 78 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 2.34 కోట్ల మంది ఓటర్లు.. 1204 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందుకోసం 33,500 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ.
కీలక వ్యక్తులు..
ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరితో పాటు 12 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్ర మంత్రుల్లో బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (సుపౌల్), నరేంద్ర నారాయణ్ యాదవ్ (అలామ్నగర్), మహేశ్వర్ హజారి (కల్యాణ్‌పుర్), రమేశ్ రిషిదేవ్ (సింఘేశ్వర్), ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ (సిక్తా), లక్ష్మేశ్వర్ రాయ్ (లౌకహా), బీమా భారతి (రుపాలి) మదన్ సాహ్ని (బహదుర్‌పుర్) బరిలో ఉన్నారు. మాజీ మంత్రుల్లో భాజపా నుంచి ప్రమోద్ కుమార్, సురేశ్ శర్మ, బినోద్ నారాయణ్ ఝా, కృష్ణకుమార్ రిషి పోటీ చేస్తున్నారు.
వారితో పాటు కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె.. సుభాషిణి యాదవ్ బిహారీగంజ్ నుంచి బరిలో నిలిచారు.
లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక..
ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే.. వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ ఎంపీ వైద్యనాథ్ మహతో మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు సునీల్ కుమార్‌ను బరిలో నిలిపింది జేడీయూ.
ఇప్పటికే అక్టోబర్ 28న తొలి విడత, నవంబర్ 3న రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. నవంబర్ 7న మూడోదఫా ఎన్నికల అనంతరం.. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఇదీ చూడండి: 'మంచి పాలనకే బిహార్ ప్రజలు ఓటు'