కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ వామపక్షవాది అని గోయల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయిన దురభిమానులకు.. వృత్తినిపుణులంటే ఎవరనే విషయంపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు రాహుల్. ఈ విషయంపై ట్వీట్ చేశారు.
"బెనర్జీ.. విద్వేషంతో కళ్లుమూసుకుపోయిన వీళ్లకు ఫ్రొపెషనల్ అంటే తెలియదు. మీరు వాళ్లకు చెప్పాలని 10 ఏళ్లు ప్రయత్నించినా అర్థం చేసుకోలేరు. కోట్ల మంది భారతీయులు మీ పనిపట్ల గర్వంగా ఉన్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కాంగ్రెస్‌కు న్యాయ్ పథకం సలహా ఇచ్చిన అభిజిత్ బెనర్జీ వామపక్ష వాది.. ఆయన సిఫారసు చేసిన పథకాన్ని ప్రజలు తిరస్కరించారని శుక్రవారం పీయూష్ గోయల్ అన్నారు. ఈ విషయంపై శనివారం స్వయంగా స్పందించారు అభిజిత్. వాణిజ్య శాఖ మంత్రి తన వృత్తి నిబద్ధతను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వార్తను జోడిస్తూ గోయల్‌పై తాజా విమర్శలు చేశారు రాహుల్.
ఇదీ చూడండి: 'మహా'పోరు: పైకి పొత్తులు... లోన కత్తులు!