ETV Bharat / bharat

ఆగని ఆకలి కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు - పేదరికం తాజా వార్తలు

ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పాటు భారత్​నూ పట్టి పీడిస్తోన్న భూతం పేదరికం. స్వాతంత్ర్యానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొందరికే పరిమితం కావడం వల్ల పేదధనిక అంతరాలు ఏర్పడ్డాయని నిపుణులు అంటున్నారు. 130 కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరికంలోనే మగ్గుతున్నారని ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి. మరి ఈ దుస్థితి మారేదెలా? ఈ పరిణామాలపై విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

There will be poverty in the country for a few more days. Is there a solution?
ఆగని ఆకలు కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు
author img

By

Published : Feb 27, 2020, 9:10 AM IST

Updated : Mar 2, 2020, 5:26 PM IST

పేదరికం ఒక విష వలయం. కనీస అవసరాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని స్థితిని ‘పేదరికం’ అని ఐక్యరాజ్య సమితి నిర్వచించింది. పేదరికం బాధను అంధుడు సైతం చూడగలడంటూ నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వాపోయారు. ఆకలి, అనారోగ్యం ఈ రెండూ పేదరికం కవలలు. పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలతో భారత్‌ నేడు సతమతమవుతోంది. స్వాతంత్య్రానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొందరికే పరిమితం కావడంతో బీద ధనిక అంతరాలు కొనసాగుతున్నాయి. పోషకాహార లోపాలను అధిగమించడంలో కొంత ముందడుగు పడినా, చేయాల్సింది మరెంతో ఉందని క్షేత్రస్థాయి వాస్తవాలు చాటుతున్నాయి. 2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్ల వ్యవధిలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు గణాంకాలు చెబుతున్నా, 130 కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరికంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ నివేదిక స్పష్టీకరించింది.

పథకాలు ఎంత వరకు గట్టెక్కిస్తాయి?

ప్రధానిగా ఇందిర అయిదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం తరవాత చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇప్పటి గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాల వరకు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేకానేక పథకాలు చేపడుతూ వచ్చాయి. హరిత విప్లవం పుణ్యమాని 60వ దశకం చివరలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల ఆహార భద్రతకు బాటలుపరచింది. అన్నార్తుల ఆకలి కేకలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. పేద రైతులకు పెట్టుబడి సాయాలు, పేదలకు పింఛను పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా కిందకు దిగిరానంటున్న పేదరికం గణాంకాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఈ తరహా పథకాల ద్వారా ఆకలి మంటల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని ఇన్నేళ్ల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి. పేదలకు ఆదాయ భద్రతతో పాటు విద్య, వైద్యం, రక్షిత తాగునీరు వంటివి అందాలి. దారిద్య్ర రేఖను స్వయంకృషితో అధిగమించేలా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా వీటికోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆశించిన స్థాయిలో లేవు. సేవల నాణ్యతా పలు విమర్శలకు తావిస్తోంది. పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహాలు అవసరమని దీన్నిబట్టి బోధపడుతోంది. తాజా ప్రపంచ ఆకలిసూచీ-2019 నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న చిన్నారులు 2008-12 మధ్యకాలంలో 16.50 శాతం నమోదైతే, 2014-18 మధ్యకాలంలో వారి సంఖ్య 20.83 శాతానికి పెరిగింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వాస్తవానికి పేదరికాన్ని ఎలా గణించాలన్న దానిపై ప్రభుత్వపరంగానే స్పష్టత కొరవడుతోంది. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం నియమించిన అలఘ్‌ కమిటీ (1979), లకడాయీలా (1993), తెందూల్కర్‌ (2009), రంగరాజన్‌ కమిటీ (2014)లు పేదరికం గురించి భిన్నమైన నిర్వచనాలు ఇవ్వడమే దీనికి దాఖలా. ఆ మేరకు తెంద్కూలర్‌ కమిటీ దేశంలో పేదలు 22 శాతమని అంచనా వేయగా, రంగరాజన్‌ కమిటీ 29.5 శాతమని చెప్పింది.

ఆ వర్గాల వారే ఎక్కువగా!

జీవితమంతా పేదరికంతో మగ్గినవారిని శాశ్వత పేదలంటారు. వీరు తరవాతి తరానికీ పేదరికాన్ని బదలాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఎస్సీ, ఎస్టీల్లో ఉంటున్నారు. ‘క్రానిక్‌ పావర్టీ రీసెర్చ్‌ సెంటర్‌’ పత్రాల ప్రకారం దేశంలోని పేదల్లో 50 శాతం ‘శాశ్వత పేదరిక’ పరిధిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్టీల్లో పేదరికం తగ్గుదల మిగిలినవారికన్నా తక్కువ. 1993-94, 2004-05 సంవత్సరాలనాటి అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా పేదరికం 37శాతం నుంచి 27 శాతానికి దిగివస్తే, ఎస్టీల్లో మాత్రం 51.9 శాతం నుంచి 47.3 శాతానికే తగ్గింది. దీన్నిబట్టి పేదరిక నిర్మూలన పథకాలు వీరికి చేరవేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అవగతమవుతోంది. పేదల స్థితిగతులు ఇలాఉంటే, దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతున్నారు. 2018లో కేవలం ఒక శాతం ధనవంతుల సంపద 39 శాతం అధికమైతే, అట్టడుగున ఉన్న సగం జనాభా సంపద మూడు శాతమే పెరిగింది. దేశంలో సగానికిపైగా సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉంది. పదేళ్లపాటు జీడీపీలో తొమ్మిది శాతం వృద్ధి సాధ్యపడితే ప్రగతిఫలాలు అట్టడుగు స్థాయికి చేరి పేదరికం నిర్మూలన సాధ్యపడుతుందన్న అంచనాలు గురితప్పాయి. గ్రామీణ పేదరికానికి పగ్గాలు వేయగల వ్యవసాయానికి సరైన గిట్టుబాటు దక్కకపోవడం శాపమవుతోంది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే, పట్టణాల్లో అవి పెరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల పట్టణాలు, నగరాలకు వలసలు పెచ్చరిల్లుతున్నాయి.

లోపాలను అరికట్టితే చాలు

భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశ స్వాతంత్య్ర పరమార్థమని మహాత్మాగాంధీ చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన లక్షించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం రాజకీయ స్వాతంత్య్రాన్ని మాత్రమే సాధించుకున్నామని అప్పట్లో అన్నారు. సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్ర సాధన తదుపరి లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థికన్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగ నిర్మాతల ఆశయం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ లక్ష్యసాధనకు దూరంగా ఉండటం మన వ్యవస్థల వైఫల్యాలనే చాటుతోంది. పన్నెండు పంచవర్ష ప్రణాళికలు, మూడు వార్షిక ప్రణాళికలు కాలగర్భంలో కలిసిపోయినా, భారత్‌ ఇంకా దిగువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనుగడ సాగిస్తోంది. దేశంలో క్రమేపి పేదరికం తగ్గుముఖం పడుతోందని చెబుతున్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల సంఖ్య ఏటా పెరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలుపలికి తీసుకురావాలి. పథకాల అమలులో లోపాలను అరికట్టి అర్హులకే లబ్ధి నేరుగా చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్షేమ ఫలాలను పేదలు సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచాలి. తద్వారా పేదరికం కోరల నుంచి వారు బయటపడేలా చేయాలి.

- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు (రచయిత, ఆంధ్ర విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగ ఆచార్యులు)

Last Updated : Mar 2, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.